రాజ్‌భవన్‌లో తేనీటి విందు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ ఆహ్వానం మేరకు రాజ్ భవన్‌కు విచ్చేసారు. ఎన్ వి.రమణ, శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఘనంగా స్వాగతం పలకగా, సీజే పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి భారతి రాజ్ భవన్‌కు చేరుకోగా, ముఖ్యమంత్రి సీజేకు ఎదురేగి రాజ్ భవన్ దర్బార్ హాలులోకి తోడ్కొని వచ్చారు. తొలుత రాజ్‌భవన్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ విశ్రా రాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినీత్ శరణ్, జెకె మహేశ్వరి దంతపులు సుప్రీం సీజేతో కలిసి వచ్చారు. దర్బారు హాలులో గౌరవ గవర్నర్ తో భేటీ అయిన సుప్రీం సీజే సమకాలీన అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు కార్యదర్శులు ధనుంజయరెడ్డి, ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ నివాస్, సిపి కాంతి రాణా టాటా, ఐఎఎస్ అధికారులు కృతికాశుక్లా, షన్ మోహన్, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.













