Ippala Ravindra Reddy: ఇప్పాలపై సిస్కో సీరియస్..? ఉద్యోగం ఊడిందా..?
ఇప్పాల రవీంద్రా రెడ్డి (Ippala Ravindra Reddy) వ్యవహారం రెండు రోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది. గతంలో నారా లోకేశ్ (Nara Lokesh) సహా తెలుగుదేశం పార్టీ (TDP) నేతలపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో విరుచుకుపడిన ఇప్పాల, తాజాగా లోకేశ్‌తోనే భేటీ కావడం సంచలనంగా మారింది. మంగళవారం ఏపీ ప్రభుత్వం, సిస్కో (Cisco) మధ్య జరిగిన ఒప్పందం సమయంలో ఈ భేటీ జరిగింది. సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్‌గా (Cisco territory accounts manager) ఇప్పాల హాజరవడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. దీంతో లోకేశ్ కార్యాలయం సిస్కోకు లేఖ రాసి, ఇప్పాలను ఏపీ వ్యవహారాల నుంచి తప్పించాలని కోరింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా సిస్కోతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీతో (Young India Skill University) సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ (Cisco Networking Acadamy) ఈ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ కార్యక్రమానికి ఇప్పాల రవీంద్రా రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆయన్ను సిస్కో యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పించిందనే వార్తలు వస్తున్నాయి. లోకేశ్ కార్యాలయం లేఖ తర్వాత సిస్కో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై సిస్కో నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
గతంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంతో సంబంధం ఉన్న ఇప్పాల.. 2017లో విశాఖలో అరెస్టయ్యారు. అలాంటి వ్యక్తి సిస్కోలో ఉన్నత స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగించింది. టెరిటరీ అకౌంట్ మేనేజర్‌గా ఆయన దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో సిస్కో బిజినెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఏపీ ఒప్పందం తర్వాత టీడీపీ నేతలు ఆయన గత పోస్టులను వైరల్ చేయడంతో వివాదం మరింత రాజుకుంది. దీంతో లోకేశ్ కార్యాలయం సిస్కోకు లేఖ రాసి, ఇప్పాలను ఏపీతో సంబంధమైన ఏ ప్రాజెక్టుల్లోనూ పాల్గొనకుండా దూరం పెట్టాలని కోరింది.
ఈ లేఖ ప్రభావంతోనే, మరుసటి రోజు తెలంగాణ ప్రభుత్వం సిస్కోతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇప్పాల హాజరు కాలేదు. ఈ వ్యవహారం రాజకీయంగా టీడీపీకి పైచేయిగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పాల వైసీపీతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారనేది తెలీదు. అయితే గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినందున ఇప్పుడు ఇప్పాలను ఏపీ సర్కార్ దూరం పెట్టింది. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పాల చేసిన తప్పునకు తాము విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని వైసీపీ ఆవేదన చెందుతోంది. మరోవైపు సిస్కో కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.







