కొత్త ఆలోచనలకు… అవకాశాలకు వేదికగా విశాఖలో నవంబర్ 12, 13వ తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు
విశాఖలో నవంబర్ 12, 13వ తేదీల్లో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో ప్రాంతీయస్థాయిలో కూడా సదస్సులు ఏర్పాటు చేశారు. నావిగేటింగ్ ఛేంజ్: లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ థీమ్‌తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు అందరినీ ఆకట్టుకునేలా ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను ఆహ్వానిస్తున్నారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సీఐఐ పార్టనర్ షిప్ సదస్సులకు సంబంధించి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
ఆరు ప్రధాన రంగాలపై చర్చలు ఏర్పాటు చేశారు. వాణిజ్యం, గ్లోబల్ వాల్యూ చైన్స్: భారత ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా వ్యూహాత్మక ప్రణాళికలు, సరఫరా గొలుసుల బలోపేతంతోపాటు, పారదర్శక పాలన, స్థిరమైన భాగస్వామ్యాలు, సురక్షితమైన అంతర్జాతీయ పెట్టుబడుల సాధన, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ స్థానానికి చేరిన భారత్‌లో ఏఐ, రక్షణ రంగ తయారీ, సైబర్ సెక్యూరిటీ విస్తరణ., దేశంలోని 65 శాతం యువశక్తికి ఆధునిక డిజిటల్, క్లీన్ ఎనర్జీ నైపుణ్యాలను అందించి ప్రపంచ మానవ వనరుల కేంద్రంగా మార్చడం, క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ గ్రోత్: గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడుల సమీకరణ, వ్యవసాయం, బయోఎకానమీ: ఆధునిక సాంకేతికత, వాతావరణ మార్పులను తట్టుకునే స్మార్ట్ అగ్రికల్చర్ ద్వారా ఆహార భద్రత, రైతుల ఆదాయ పెంపు వంటి వాటిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
నాలెడ్జ్ షేరింగ్
‘విశాఖలో జరగబోయే 31వ భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజలు చర్చించుకోవాలి. వినూత్నంగా ఆయా రంగాలను ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలు రేకేత్తించాలి. టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా రంగాల్లో ఛాంపియన్‌గా నిలిచిన వాళ్లే గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలని కోరారు. అలాగే సమ్మిట్‌లో పబ్లిక్ పాలసీలపై కీలక చర్చలు జరగాలి. వ్యాపారాలు, పెట్టుబడులువంటి అంశాలతోపాటు ఆయా రంగాల్లో సవాళ్లు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై రకరకాల చర్చలు జరగాలి. వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్వంటి అంశాలపై చర్చించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘బిల్డ్ ఏపీ’ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడు లకు అవకాశాలు, కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రకటించినట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్రో ఖాతాను ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేశామని సీఎం తెలిపారు. సాంకేతికతతో కూడిన వేగవంతమైన అనుమతులు, డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాయలసీమ లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో ఉన్న అపారమైన అవకాశా లను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అమరావతిని గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తూ క్వాంటమ్ వ్యాలీని నెలకొల్పుతామని, రియల్ టైమ్ గవర్నెన్స్‌కు ఏఐని జోడిస్తున్నామని పేర్కొన్నారు.
వివిధ నగరాల్లో ప్రాంతీయ సదస్సులు, రోడ్ షోలు
విశాఖలో నవంబరు 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహకాల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేశారు. అదే విధంగా దేశంలోని ఇతర నగరాల్లో రోడ్ షోలను కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ ప్రాంతీయ సదస్సులో 15 సంస్థలతో కుదుర్చుకున్న ఎంఓయూల ద్వారా రూ.4,256 కోట్ల పెట్టుబడులు.. 14,261 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మొత్తం ఐదు చోట్ల జరిగే ఈ ప్రాంతీయ సదస్సుల ద్వారా 161 ఎంఓయూలు కుదుర్చుకుంటాం” అని పరిశ్రమల శాఖ తెలిపింది.
పారిశ్రామికాభివృద్ధికి ఎపినే బెస్ట్: లోకేష్
వేగవంతమైన నిర్ణయాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఏపీని ఎంచుకోవాలని పెట్టుబడిదారులకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కాకినాడ కేంద్రంగా గోదావరి జిల్లాల్లో పెట్టుబడుల జోరు పెంచేలా ఇటీవల నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో రూ.4,256 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 14 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు. బ్లూ ఎకానమీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిలో గోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు పరిచయం చేయడమే లక్ష్యంగా కాకినాడలో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధి అవకాశాల కోసమే ప్రాంతీయ సదస్సులు
పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.యువరాజ్
సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు, ఎంఎసఎంఈలు, స్టార్టప్‌లు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.యువరాజ్ అన్నారు. యువతకు ఉపాధి, నైపుణ్యం, విద్య, పారిశ్రామిక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంపైనా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 600 ఎంఎసఎంఈలు దరఖాస్తు చేసుకోగా.. ఉత్తరాంధ్ర నుంచి 150 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. వాటిలో ఎంపికైన 25 సంస్థల ఉత్పత్తులను విశాఖ సదస్సులో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.








