TTD Parakamani: పరకామణి దొంగతనం కేసులో కొత్త ట్విస్ట్..!!

తిరుమల (Tirumala) శ్రీవారి పరకామణిలో (parakamani) జరిగిన భారీ చోరీ వ్యవహారంపై సీఐడీ (CID) విచారణను పునఃప్రారంభించింది. హైకోర్టు (AP High Court) ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ, ఈ కేసును లోక్ అదాలత్‌లో (Lok Adalat) రాజీ చేయడం వెనుక ఉన్న కారణాలపై దృష్టి సారించింది. కేసు విచారణలో భాగంగా సీఐడీ డిజి రవిశంకర్ అయ్యనార్ తిరుమల చేరుకున్నారు. ముందుగా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైళ్లను, ఎఫ్‌ఐఆర్ వివరాలను, దర్యాప్తు పురోగతిని, లోక్ అదాలత్ రాజీకి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. కోట్ల రూపాయల విలువైన స్వామివారి సొమ్ము అపహరణపై జరిగిన దర్యాప్తు పద్ధతిపై సీఐడీ ప్రధానంగా దృష్టి సారించింది.
కోయంబత్తూరు వెంకట రవి కుమార్ (Ravi Kumar) అనే వ్యక్తి పెద్ద జీయర్ మఠం తరపున పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కించే గుమస్తాగా పని చేసేవారు. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో విదేశీ కరెన్సీని లెక్కిస్తుండగా, రవికుమార్ కొన్ని డాలర్ నోట్లను తన పంచెలో కుట్టించుకున్న ప్రత్యేక జేబుల్లో దాచుకుంటూ టీటీడీ (TTD) సిబ్బందికి పట్టుబడ్డాడు. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌పై ఐపీసీ సెక్షన్లు 379, 381 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రవికుమార్ చాలా ఏళ్లుగా పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడని, ఆ సొమ్ముతోనే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో దర్యాప్తు అత్యంత వివాదాస్పదమైంది. తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేయకుండా, 41-ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. చోరీ చేస్తూ దొరికిన రవి కుమార్, అతని కుటుంబ సభ్యులు టీటీడీకి సుమారు 40 కోట్ల విలువ చేసే స్థిరాస్తులను గిఫ్ట్ డీడ్ ద్వారా విరాళంగా ఇచ్చారు. ఆస్తులను విరాళంగా తీసుకున్న తర్వాత, పోలీసులు ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. భారీ చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడం, కోట్ల ఆస్తులున్న నిందితుడిని తప్పించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. స్వామివారి సొమ్మును దోచుకున్న నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, అతన్ని దాతగా మార్చి, కేసును రాజీ చేసుకోవడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు, టీటీడీ అధికారులు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో జరిగిన లోక్ అదాలత్ రాజీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, లోక్ అదాలత్ రాజీని తప్పుబట్టింది. కేసు దర్యాప్తును మరింత లోతుగా, సమగ్రంగా నిర్వహించాలని ఆదేశిస్తూ, విచారణ బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గత వైసీపీ హయాంలో సుమారు రూ.100 కోట్ల వరకు పరకామణి సొమ్ము పక్కదారి పట్టిందని ఆరోపించింది. అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఉందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన అప్పటి టీటీడీ చైర్మన్, తనకు ఈ విషయంలో ప్రమేయం లేదని, దమ్ముంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
సీఐడీ డిజి రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో విచారణ పునఃప్రారంభం కావడంతో, గతంలో లోక్ అదాలత్‌లో రాజీ చేసిన అధికారుల పాత్ర, రవి కుమార్ వెనుక ఉన్న వ్యక్తులు, అపహరణకు గురైన మొత్తం సొమ్ము వంటి కీలక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తాజాగా రవిశంకర్ అయ్యనార్ ను కలిసి ఈ కేసుకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను అందించారు. ఈ కేసు విచారణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.