Vijaya Sai Reddy: విజయసాయి రెడ్డికి మళ్లీ నోటీసులు.. ఈసారి ఏం బాంబ్ పేలుస్తారో..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి (Vijayasai Reddy) ఏపీ సీఐడీ (AP CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని కోరింది. కాకినాడ పోర్టు (Kakinada Port), సెజ్ (Kakinada SEZ) భూములను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా విజయసాయి రెడ్డి ఇప్పటికే ఓసారి సీఐడీ ముందు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడంతో ఇంకేం మాట్లాడతారోనని వైసీపీ (YCP) కేడర్ టెన్షన్ పడుతోంది.
వైసీపీ పుట్టక ముందు నుంచే వైఎస్సార్ ఫ్యామిలీతో (YSR Family) విజయసాయి రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఆ ఫ్యామిలీ వ్యవహారాలతో పాటు వైసీపీ గూడుపుఠాణీలన్నీ ఆయనకు తెలుసు. అలాంటి వ్యక్తి ఇటీవలికాలంలో పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటికొచ్చేశారు. పదవినీ వదులుకున్నారు. అప్పటి నుంచి తాను స్వేచ్ఛా జీవినని.. వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. అయితే తాను నిజాయితీపరుడినని.. తనకు తెలిసిన సమాచారాన్ని అబద్ధం చెప్పకుండా చెప్పేస్తానని విజయసాయి చెప్తున్నారు. సీఐడీ విచారణలో కూడా తనకు తెలిసిన విషయాలను చెప్పేసినట్లు బయటికొచ్చి మీడియా సాక్షిగా వెల్లడించారు.
కాకినాడ సెజ్ భూములు లాక్కోవడం వెనుక తన ప్రమేయం లేదని.. ఆ వ్యవహారాలన్నీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తనయుడు విక్రాంత్ రెడ్డే (Vikranth Reddy) చూశారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. అంతేకాక.. వైవీ సుబ్బారెడ్డి అమెరికా వెళ్లిన ప్రతిసారీ కేవీ రావు (KV Rao) విల్లాలోనే బస చేస్తారన్నారు. వాళ్ల మద్య అంతటి సాన్నిహిత్యం ఉందన్నారు. మరోవైపు లిక్కర్ స్కాంలో (Liquor Scam) కూడా తన పాత్రేమీ లేదన్నారు. ఆ వ్యవహారాలన్నింటికీ కర్త, కర్త, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని (Kasireddy Rajasekhar Reddy) విజయసాయి రెడ్డి బాంబ్ పేల్చారు. ఒకవైపు అసలు లిక్కర్ స్కామే జరగలేదని వైసీపీ చెప్తుంటే విజయసాయి రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా స్టేట్ మెంట్ ఇచ్చారు.
విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐడీ మరిన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అటు కాకినాడ పోర్టు, సెజ్ తో పాటు లిక్కర్ స్కాంకు సంబంధించి పలువురు కీలక నేతలను అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి (Mithun Reddy) లిక్కర్ స్కాంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో విజయసాయి రెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలవడంతో ఇంకే విషయాలు చెప్తారో.. ఎక్కడ తమ కొంప ముంచుతారోనని వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయారని ఆ పార్టీ కేడర్ చెప్పుకుంటోంది.













