చంద్రబాబుకు సీఐడీ నోటీసులు..! 23న విచారణకు రావాలని ఆదేశాలు!!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పరాభవం.. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోక ముందే మరో దెబ్బ తగలింది. రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఆయనకు నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. రాజధాని అతిపెద్ద భూకుంభకోణం అని వైసీపీ శ్రేణులు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణకు వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది.
రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. అందుకోసం 30వేలకు పైగా ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించింది. ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయబోతున్నట్టు టీడీపీ శ్రేణులకు ముందే తెలుసని.. అందుకే ఆ పార్టీ నేతలు, వారి బంధువులు కొందరు ముందుగానే భూములు కొన్నారని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది ఇన్ సైడర్ ట్రేడింగేనని చెప్తోంది. దీనివల్ల రైతులకు నష్టం జరిగిందనేది ప్రభుత్వ పెద్దల వాదన. అందుకే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది జగన్ ప్రభుత్వం.
రాజధాని భూక్రయవిక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ పెద్దలు చెప్తున్నారు. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరినైనా విచారించే అధికారం దీనికి కట్టబెట్టింది కూడా. ఇప్పటికే పలువురి క్షేత్రస్థాయిలో విచారించిందీ కమిటీ. పలువుర ఐఎఎస్ అధికారలను ఇప్పటికే విచారించిన కమిటీ.. తాజాగా అప్పటి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిన నేతలపై దృష్టి పెట్టంది.
సీఆర్డీఏ ఛైర్మన్ గా వ్యవహరించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చారని సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం రాజధాని ప్రకటనకంటే ముందే ఇతరులు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తోంది. భూసమీకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వానికి బదలాయించారని చెప్తోంది. దీన్ని చట్టవిరుద్ధంగా భావిస్తున్న సర్కార్.. 41సి సెక్షన్ కింద నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
చంద్రబాబునాయుడితో పాటు నాడు అమరావతి భూ సేకరణలో కీలకంగా వ్యవహరించిన నాటి మంత్రి నారాయణ, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులకు కూడా సీఐడీ నోటీసులు ఇస్తున్నట్టు సమాచారం. మరి నోటీసుల మేరకు చంద్రబాబు విచారణకు హాజరవుతారా.. లేదా కోర్టులను ఆశ్రయిస్తారా.. అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే రాజధాని భూఅంశంపై హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ పైన కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఎక్కడివరకూ వెళ్తుందనేది ఆసక్తిగా మారింది.













