Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి, అశోక్ గజపతిరాజు రెండు పెన్షన్ల వ్యవహారం

కొందరు రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసమే వస్తారు, మరికొందరు గౌరవం కోసం. మరికొందరైతే అధికారాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తుంటారు. ప్రతి ఒక్కరిది ఒక్కో మాదిరిగా ఉంటుంది. కానీ అసలు రాజకీయాల ఉద్దేశం సేవకు సంబంధించినదే. ఒకప్పుడు నిజాయితీతో ప్రజల కోసమే పనిచేసే వారు ఉండేవారు. కానీ కాలక్రమేణా రాజకీయాల్లో వ్యాపార దృక్పథం పెరిగిపోయింది. డబ్బు ఎలా రావాలి? ఎంత త్వరగా సంపాదించాలి? అన్నదే ఎక్కువమంది ఆలోచన. అవసరం ఉన్నా..లేకపోయినా, ఎక్కువమంది ఈ దిశగానే నడుస్తున్నారు.
ఇటీవల రాష్ట్రం నుంచి కేంద్రం వరకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు ప్రముఖుల విషయంలో ఓ విచిత్రమైన అంశం వెలుగులోకి వచ్చింది. వారి గురించి ఓ సంస్థ సేకరించిన సమాచారంలో తెలుసుకున్న విషయాల ప్రకారం – వారు ఒకే సమయంలో రెండు ప్రభుత్వాల నుంచి పింఛన్లు పొందుతున్నారని తెలుస్తోంది. అంటే రాష్ట్రం నుంచి ఒకటి, కేంద్రం నుంచి ఇంకొకటి. ఇది చట్టబద్ధంగా ఉండొచ్చు కానీ నైతికంగా సరైందా అనే ప్రశ్న ప్రజలలో తలెత్తుతుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju), సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi), టీజీ వెంకటేష్ (TG Venkatesh), నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) వంటి వారు ఇటు రాష్ట్రం అటు కేంద్రం..ఇలా రెండు రకాలుగా పింఛన్లు పొందుతున్నట్టు పేర్కొనబడింది. వీరు ముందు ఎమ్మెల్యేలుగా, ఆ తర్వాత ఎంపీలుగా సేవలు అందించిన వారు. ఇప్పుడు వారి హక్కుగా పింఛన్లు పొందుతుండొచ్చు, కానీ సామాన్యుల పరిస్థితి చూస్తే ఇది సబబు అనిపించదు.
ప్రభుత్వాలు సామాన్యుల పట్ల విధిస్తున్న కఠిన నిబంధనలు, పింఛన్ కోసం వారు ఎదుర్కొనే ఇబ్బందుల జాబితా చూస్తే, ప్రజా ప్రతినిధుల విషయంలో ఇంత సడలింపు ఎందుకు? అనే అనుమానాలు వస్తాయి. నిజంగా సేవాభావం ఉన్నవారు ఒకే స్థానం నుంచి మాత్రమే పింఛన్ తీసుకొని మిగతా వారికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ డబ్బుపై బాధ్యత వహించే స్థాయిలో ఉన్నవారు, ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం సమాజానికి మంచి సంకేతంగా నిలుస్తుంది. పైగా పింఛన్ తీసుకునే సామాన్యుడికి ఉన్న ఆంక్షలు వీరిపై ఎందుకు వర్తించడం లేదు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది.