సీఈసీ సునీల్ అరోరాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన సీఎం చంద్రబాబు.. దిల్లీ వేదికగా పోరాటానికి సమాయత్తమయ్యారు. దీనిలో భాగంగా శనివారం ఆయన దిల్లీకి పయనం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకెళ్లి మరోసారి తన నిరసన తెలపనున్నారు. రేపు ఉదయం 9గంటలకు చంద్రబాబు దిల్లీకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోరా, ఇతర కమిషనర్లను కలవనున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు.. ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. తదితర పరిణామాలన్నింటినీ ఈసీఐ దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు. అలాగే, వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను సైతం పెంచాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది.













