శ్రీశైలం మల్లన్న సన్నిధిలో జస్టిస్ ఎన్వీ రమణ…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా శ్రీశైలానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు నందినికేతన్ అతిథి గృహం వద్ద ఘన స్వాగతం లభించింది. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైల ఆలయం చేరుకున్న సీజేఐ దంపతులకు రా•గోపురం వద్ద ఈవో కేఎస్ రామారావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలోని మల్లికార్జునస్వామి, భ్రమరాంబదేవి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికను మంత్రి వెలంపల్లి అందజేసి శాలువాలతో సత్కరించారు.
ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన పంచమరాల జీర్ణోద్ధరణ పనుల్లో బయటపడిన తామ్రపత్ర శాసనాలను జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తిగా పరిశీలించారు. వాటి గురించి ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఇండియా మైసూర్ విభాగం డైరెక్టర్ మునిరత్నం రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రెండు గంటలపాటు శ్రీశైలంలో గడిపిన సీజేఐ అనంతరం హైదరాబాద్‍కు బయల్దేరివెళ్లారు. ఆయన వెంట ఆంధప్రదేశ్, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయమూర్తులు జస్టిస్ డి.వెంకటరమణ, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.