అనాథాశ్రమం నుంచి అమెరికాకు!
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శిశుగృహంలో పెరుగుతున్న ఓ అనాథ బాలుడిని అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆ బాలుడిని తల్లి కెరోలిన్ మారీ పాల్సన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త క్రిస్టియన్ పాల్సన్ షికాగో ఫెడరల్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారని చెప్పారు. తమకు సంతానం లేని కారణంగా సచిన్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తల్లిదండ్రులుగా అతడి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 2016 డిసెంబరు 1న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో మతిస్థిమితం లేని ఓ తల్లి సచిన్‌కు జన్మనిచ్చిందని, పాల్సన్ దంపతులు సీఏఆర్ఏ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, పూర్తి విచారణ అనంతరం న్యాయస్థానం అనుమతితో బాలుడిని దత్తత ఇచ్చామని ఐసీడీఎస్ పీడీ సుఖ్జీవన్బాబు వివరించారు.













