మాగుంట కోటలో చెవిరెడ్డి..?
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ క్లారిటీకి వచ్చిందా..? ఎంపీగా సీఎం జగన్ సన్నిహితుడు చెవిరెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించిందా..? అంటే వైసీపీ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా స్థానికేతరుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డినే బరిలో దింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు కారణాల రీత్యా సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని సీఎం పక్కన పెట్టారు. ఎలాగైనా మాగుంటకే టికెట్ ఇప్పించుకునేందుకు ఒంగోలు ఎమ్మెల్యే, సీఎం సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
బాలినేని ఎన్నిరకాలుగా ప్రయత్నించినా.. మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించలేదు. పోనీ ఆయన కుమారుడికైనా అన్నా కూడా నో ఛాన్స్ అని తేల్చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు నుంచి మంత్రి రోజా, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు సహా పలు పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. వారు ఆసక్తి కనబర్చకపోవడంతో తెరపైకి చెవిరెడ్డి పేరు వచ్చినట్లు సమాచారం. దీంతో బాలినేని ఆశీస్సులను చెవిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. సీఎం జగనే టికెట్ ఇస్తున్నప్పుడు, తనదేముందని చెవిరెడ్డితో బాలినేని అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం వద్ద చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకించినట్టు సమాచారం.
ఒంగోలు లోక్‌సభ స్థానం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి నమ్మకమైన నియోజకవర్గమైంది. ఆ భరోసాతోనే చెవిరెడ్డి కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే..ఇప్పుడు ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న చెవిరెడ్డికి .. బాలినేని వర్గం ఎంతవరకూ సహకరిస్తుందన్నది అనుమానంగా మారింది. దీనికి తోడు మాగుంటకు టికెట్ ఖరారు చేయడకపోవడంతో ఆయన వర్గం ఎలా స్పందిస్తుంది.. ఇలాంటి సమయంలో వైసీపీ గెలుపుపై ఎలాంటి అవకాశాలు ఉండే పరిస్థితి ఉందన్నది ఆసక్తికరంగా మారింది.
వైఎస్ కుటుంబానికి ఆది నుంచి చాలా సన్నిహితుడు, అనుచరుడు చెవిరెడ్డి. అందుకే చెవిరెడ్డికి సీఎం జగన్ దగ్గర అంత పలుకుబడి ఉంది. జగన్ చెబితే చాలు .. దేనికైనా సిద్ధమంటారు చెవిరెడ్డి. దీనిలో భాగంగానే ఒంగోలు లోక్ సభ నుంచి చెవిరెడ్డిని దించాలని జగన్ నిర్ణయించారు. అది వైసీపీ అడ్డా కావడంతో చెవిరెడ్డికి పెద్దగా అభ్యంతరాలు లేవు. దీనికి తోడు గెలిస్తే, మరో నియోజకవర్గం వీరి వశమవుతుంది. వరుసగా పార్టీ నుంచి నేతలు పోతున్నా, సీఎం జగన్ చలించడం లేదు. పోయిందంతా చెత్తేలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. సాక్షాత్తూ తన మాటను కూడా జగన్ పట్టించుకోలేదన్న ఆవేదన బాలినేనిలో ఉంది. అయినా సరే పార్టీని అంటిపెట్టుకుని ఉంటే.. ఇప్పుడు ఇలా ట్విస్ట్ ఇచ్చారని మధనపడుతున్నారు బాలినేని.అలిగితే అలకతీరుస్తున్నారు..కానీ మాటకు మాత్రం విలువ ఇవ్వడం లేదన్నది బాలినేని వర్గీయుల టాక్.













