తిరుమల ఆలయంలో మార్పులు.. భక్తులకు మరిన్ని అందాలు
కలియుగ వైకుంఠం తిరుమల. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. క్షణకాల దర్శనం కోసం పరితపిస్తుంటారు. భక్తుల అవసరాల మేరకు తిరుమల ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోంది. భక్తుల సౌకర్యార్థం ఎన్నో సౌకర్యాలు తిరుమలలో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా తిరుమలేశుడి సన్నిధిలో భక్తులకు మరిన్ని చారిత్రక విశేషాలు చూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందుకోసం ఆలయంలో కొన్ని నిర్మాణాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది.
తిరుమల ఆలయంలో కొన్ని నిర్మాణాలు తొలగించడం ద్వారా భక్తులకు శ్రీవారికి చెందిన మరిన్ని చారిత్రక దృశ్యాలను చూపించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆలయంలోని రంగనాయకుల మండపం, వగపడిలలో అప్పటి అవసరాలకు అనుగుణంగా గతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అయితే వీటిని తొలగించాలని ప్రస్తుత టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆగమశాస్త్ర సలహా మండలి కూడా టీటీడీ నిర్ణయాలకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే ఈ నిర్మాణాలను తొలగించనున్నారు.
శ్రీవారి ఆలయంలో అనేక చారిత్రక అంశాలు దాగి ఉన్నాయి. ఆలయ నిర్మాణంలో అవలంభించిన ఆర్కిటెక్ట్ విధానం, స్తంభాలపై చెక్కిన అపూరూప శిల్పకళా సౌందర్యం వర్ణనాతీతం. ఆలయంలోని శిల్పసంపద ఎన్నిసార్లు చూసినా తనివీరదు. అయితే శ్రీవారి ఆలయంలో భక్తులకు కనిపించేవి కొన్నే. కనిపించని ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఇంకా దాగి ఉన్నాయి. ఆలయంలో అవసరానికి తగినట్లు మార్పులు చేయడంతో అవన్నీ మరుగునపడిపోయాయి.
ఆలయ ఈశాన్య దిశలో స్వామి వారి ప్రసాదాలు తయారు చేసే వగపడి ఉంది. అంతేకాక.. ధ్వజస్తంభానికి ఎడమవైపున ఉండే రంగనాయకుల మండపంలో ఇటుకలతో కొన్ని నిర్మాణాలు చేశారు. అయితే ఈ మధ్యే వగపడిలోని లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆలయం వెలుపలకు తరలించారు. దీంతో అక్కడ ఉన్న గదుల నిర్మాణాలను తొలగించి భక్తులు సందర్శించడానికి వీలుగా మార్పులు చేయనున్నారు. ఇక రంగనాయకుల మండపానికి పక్కనే ఉన్న స్థలాన్ని సీసీ కెమెరాల పరిశీలన, అధికారుల సామాగ్రి భద్రపరిచేందుకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీటిని ఇంకోచోటికి తరలించున్నారు. తద్వారా ఈ ప్రదేశాలు కూడా భక్తులు సందర్శించేందుకు అందుబాటులోకి రానున్నాయి.













