‘యాత్ర’కు వేళాయెరా..!
చంద్రబాబుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీలో హుషారు ఉరకలెత్తుతోంది. వరుస కేసులతో అధినేత జైల్లో ఉండడంతో ఢీలాపడిన టీడీపీ కార్యకర్తలు, నేతల్లో…కోర్టు తీర్పు ఆనందాన్ని నింపింది. మరోవైపు..చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో… స్కిల్ స్కామ్లో చంద్రబాబు పాత్రకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు.. పసుపుసైన్యంలో ఉత్సాహాన్ని నింపాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.. ప్లానింగ్ చేస్తున్నారు.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన దగ్గర నుంచి చంద్రబాబు యాత్రలు ఆగిపోయాయి. వాటిని మళ్లీ కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న చర్చ అప్పుడే పార్టీలో పారంభమైంది. ఎన్నికల సమీపంలోనే ఉండడంతో.. మళ్లీ పార్టీని యాక్టివ్ చేసేందుకు.. ఈ యాత్రలు చక్కని మార్గంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు.
డిసెంబర్ నెలలో చంద్రబాబు జనాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలో ఉన్నపుడే నంద్యాలలో చంద్రబాబు అరెస్టయ్యారు. కాబట్టి ఎక్కడైతే యాత్ర ఆగిందో…ఆ నంద్యాలలోనే మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జైలుకెళ్లి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రసంగాలు ఎలా ఉంటాయి. జగన్ పై ఎలాంటి విమర్శలు చేయనున్నారు..? ఎన్నికల కోసం జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్లాన్లు వేశారు. వాటినెలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. మధ్యలో వదిలిపెట్టిన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించేందుకు లోకేష్ సైతం సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ యువగళం తలపెట్టిన పాదయాత్ర .. విజయవంతంగా సాగింది. మధ్యలో స్కిల్ స్కామ్లో చంద్రబాబును ఏపీసీఐడీ అరెస్ట్ చేయడంతో.. లోకేష్ పాదయాత్రకు అర్థాంతరంగా విరామమివ్వాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు రెగ్యులర్ బెయిల్పై ఉండడంతో..యాత్రకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని లోకేష్ , టీడీపీ నేతలు సైతం భావిస్తున్నట్లు సమాచారం.
ఇక….భువనేశ్వరి కూడా 26వ తేదీనుండి నిజంగెలిచింది అనే స్లోగన్ తో బస్సుయాత్రను పునఃప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు నిజంగెలవాలి అని భువనేశ్వరి నాలుగైదు నియోజకవర్గాల్లో యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇపుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి కేసుల్లో అంతిమంగా న్యాయమే గెలుస్తుదంని భువనేశ్వరి చెప్పబోతున్నారని సమాచారం.. తన యాత్రను విశాఖపట్నం నుండి మొదలు పెట్టబోతున్నట్లు పార్టీవర్గాల భోగట్టా. ఏదేమైనా ముగ్గురు మూడు వైపుల నుంచి యాత్రను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ కేడర్లో ఎక్కడలేని ఆనందం, సంతోషం కనిపిస్తోంది.













