చేతనైతే సాయం చేయండి… అడ్డుపడకండి
తిత్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించవద్దని, అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి మండలాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఉద్దానంలోని పలాస, ఇతర ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు కావాలనే రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. చేతనైతే సాయం చేయాలి కానీ రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించవద్దంటూ చంద్రబాబు హితవు పలికారు. శ్రీకాకుళానికి పోటీగా టెక్కలి బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. బొప్పాయిపురం వద్ద అండర్ పాస్‌ను నిర్మిస్తామని తెలిపారు. తుఫాను వల్ల చాలా నష్టపోయారని, ఆందోళన చెందవద్దని, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు.













