ఏపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు : చంద్రబాబు

తాను వ్యాక్సిన్ తెప్పిస్తే మరి జగన్ ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండటమని తెలుగుదేశం పార్టీ అధినేత చంబ్రాబు నాయుడు మండిపడ్డారు. ఆన్‍లైన్ ద్వారా టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు వ్యాక్సిన్ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా ఏపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఆక్షేపించారు. ఇతర రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల యువతకు కూడా వ్యాక్సిన్ వేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ఇవ్వడం లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచిందని గుర్తు చేశారు. అడ్వాన్స్లు చెల్లించకుండా కేవలం లేఖలు రాస్తే వ్యాక్సిన్లు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించేలా లోకేశ్, ధూళిపాళ్ల, దేవినేని ఉమ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్లు కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి అని ప్రశ్నించారు.