దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో… చంద్రబాబు

ముఖ్యమంత్రి అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఇప్పటివరకు 76 మంది చనిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలు, మండల పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు ఆన్‍లైన్‍లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతి రుయా ఆసుపత్రిలో 29 మంది వరకు చనిపోయారనే వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో వాస్తవాల వెల్లడికి పార్టీ నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రూ.2లక్షల పరిహారమివ్వాలని కోరారు.
వ్యాక్సినేషన్‍పై ఏపీ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే దేశంలోనే రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందని మండిపడ్డారు. ఆక్సిజన్ అందక మరణించిన రోగుల కుటుంబాలకు సంఘీభావంగా ఇళ్ల వద్ద టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలు పెద్దమొత్తంలో వ్యాక్సిను కొనుక్కుంటుంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం లేఖలు రాయటంతోనే సమయం వృథా చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మూడో దశ వ్యాక్సిన్ పంపిణీకి రూ.1,600 కోట్లు అవసరం కాగా ముఖ్యమంత్రి మాత్రం రూ.45 కోట్లతో సరిపెట్టారన్నారు.