Super six: ఇకనైనా ఉచితాలపై చంద్రబాబు ఓపెన్ గా మాట్లాడితేనే బెటర్..
చంద్రబాబునాయుడు (Chandra Babu) రాజకీయాల్లో ఎప్పుడూ సంస్కరణవాదం వైపు ఉన్న నేత. 1995 నుంచి 2004 మధ్య ఆయన పూర్తిగా అభివృద్ధి, ప్రైవేటీకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఉచిత హామీలను పెద్దగా ప్రోత్సహించకుండా, ప్రజలకు స్వయం సమృద్ధిని పెంచే విధంగా పాలన సాగించారు. అప్పట్లో ఉచిత విద్యుత్ విషయమై కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ రానురాను రాజకీయ సమీకరణాలు మారడంతో ఆయన కూడా ఉచిత హామీలను అందించాల్సిన పరిస్థితి వచ్చింది.
2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు భారీగా ఉచిత హామీలను ప్రకటించారు. అప్పటి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(Rajasekhar Reddy) ఈ హామీలను ఎత్తి చూపుతూ “ఆల్ ఫ్రీ బాబు” అని వ్యంగ్యంగా విమర్శించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 92 సీట్లు సాధించినా, అధికారంలోకి రాలేకపోయింది. కానీ 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనతో ఏర్పడిన పరిస్థితుల్లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో మరిన్ని ఉచిత హామీలను చేర్చారు. కొన్ని అమలు చేయగలిగినా, కొన్ని చేయలేకపోయారు. దీనివల్ల 2019 ఎన్నికల్లో టీడీపీకి (TDP) చేదు అనుభవం ఎదురైంది.
ఇప్పటికే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు “సూపర్ సిక్స్” (Super Six) హామీలతో ముందుకు వచ్చారు. ప్రజలు విశ్వసించి ఆయనకు పట్టం కట్టారు. కానీ గెలిచిన ప్రతీసారీ ఉచిత హామీలే తమ విజయానికి కారణమని చంద్రబాబు భావిస్తున్నారా? లేదా ఆయన పాలనలో అభివృద్ధికి కూడా ముఖ్య స్థానం ఉందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉంది. అభివృద్ధి లేకుండా రాష్ట్రం ముందుకు సాగలేని పరిస్థితి. అందుకే చంద్రబాబు తనదైన శైలిలో ప్రజలకు సంక్షేమ పథకాలకు తగినంత నిధులు లేవని సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. అయితే ప్రజలు కూడా అభివృద్ధి ఎంత అవసరమో అర్థం చేసుకునేలా ఆయన పూర్తిగా ఓపెన్‌గా చెప్పాలనే సూచనలు వస్తున్నాయి.
ప్రస్తుతం సామాజిక పెన్షన్ల విషయంలోనూ పెద్ద చర్చ నడుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 పెన్షన్ ఇస్తుండడం ప్రభుత్వంపై పెద్ద భారం వేస్తోంది. అదనంగా, వివిధ రకాలుగా మరింత ఎక్కువగా పెన్షన్ అందుతున్న వారు కూడా ఉన్నారు. ఇది రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఒత్తిడిని తెస్తోంది. ఇదే సమయంలో అన్నా క్యాంటీన్ల విషయంలోనూ కొత్త చర్చ ప్రారంభమైంది. కేవలం రూ.5కే భోజనం అందించడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నా, కనీసం రూ.15-20 ధరకు పెంచినా పేదలకు న్యాయం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్టీసీ ఉచిత ప్రయాణం విషయానికి వస్తే, మహిళలకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. సంక్షేమ పథకాలు కొనసాగాలని అందరూ అనుకుంటున్నా, ఆర్థికంగా స్థిరంగా ఉండేలా కూడా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఉచిత హామీల పట్ల చంద్రబాబు ఓపెన్‌గా మాట్లాడి, ప్రజలకు అభివృద్ధి ఎంత అవసరమో చైతన్యం కలిగిస్తే, మొత్తం ఫోకస్ రాష్ట్ర ప్రగతిపైనే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.













