కృష్ణా జిల్లా టీడీపి అభ్యర్థుల ఖరారు?
వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి పోటీ చేసే 10 నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించుకోవాల్సిందిగా ఆ అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో నూజివీడు, కైకలూరు అభ్యర్థుల అంశాన్ని మూడు నాలుగు రోజుల్లో తేల్చేస్తామని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ రెండూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ నెల 25లోపు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష ఉంటుందని ఆ సమయంలో ఆ రెండు నియోజకవర్గాలపైనా అధినేత స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ లభించిన వారిలో.. విజయవాడ పార్లమెంటు పరిధిలో.. విజయవాడ తూర్పు(గద్దె రామ్మోహన్), సెంట్రల్(బొండా ఉమ), పశ్చిమ(షబానా ఖాతూన్), మైలవరం(దేవినేని ఉమ), జగ్గయ్యపేట(శ్రీరాం తాతయ్య), నందిగామ(తంగిరాల సౌమ్య) మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో.. పెనమలూరు(బోడె ప్రసాద్), మచిలీపట్నం(కొల్లు రవీంద్ర), అవనిగడ్డ(మండలి బుద్ధప్రసాద్), గన్నవరం(వల్లభనేని వంశీ) ఉన్నారు.













