హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. ఏం జరుగుతుంది?
అనుకున్నట్టే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు గడప తొక్కారు. అమరావతి భూకుంభకోణం కేసులో చంద్రబాబుకు సీఐడీ నోటుసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
రాజధాని అమరావతి కోసం సుమారు 33వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందులో కొన్ని అసైన్డ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి.. దాని మేరకు అసైన్డ్ స్థలాలను పూలింగ్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ జీవోను కేబినెట్ ముందుకు తీసుకెళ్లలేదని.. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ జీవో తీసుకొచ్చారని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ భూములు చెల్లవని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మంత్రులు ఆరోపిస్తున్నారు.
అయితే సీఆర్డీఏ అనేది రాజధాని భూముల సేకరణ, అభివృద్ధి కోసమే ఏర్పాటు చేసిందని.. ఇందుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. సీఆర్డీఏకు అలాంటి అధికారాలు ఉన్నాయని వారు వాదిస్తున్నారు. అయితే అసైన్డ్ స్థలాలను సేకరించే విషయంలో తమను బెదిరింపులకు గురి చేశారని.. తమకు పరిహారం విషయంలో అన్యాయం చేశారని.. కొంతమంది తనను ఆశ్రయించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్తున్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇప్పుడు సీఐడీ చంద్రబాబుకు, నారాయణకు నోటీసులు జారీ చేసింది.
అయితే ప్రభుత్వం కక్షపూరితంగానే చంద్రబాబుకు నోటీసులు అందించిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబును ఎలాగైనా జైలుకు పంపించాలనే దురుద్దేశంతోనే ఈ తప్పుడు కేసులు పెట్టారని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరి ఈ ఇష్యూలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. చంద్రబాబు పిటిషన్ ను స్వీకరిస్తుందా.. లేకుంటే చంద్రబాబు వినతిని మన్నించి కేసు కొట్టేస్తుందా.. లాంటి అనేక అంశాలు ఇప్పుడు ఆసక్తకరంగా మారాయి.













