Ashwini Vaishnaw: ఏఐ సదస్సులో సమస్యలు .. కేంద్ర మంత్రి బహిరంగ క్షమాపణ
ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ తొలిరోజు వేడుకల్లో చోటుచేసుకున్న అస్తవ్యస్త పరిస్థితులపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన వేదికపై, కనీస వసతులు లేక ప్రతినిధులు ఇబ్బంది పడటంపై ఆయన స్పందించారు. సదస్సు నిర్వహణలో తలెత్తిన లోపాలకు ప్రభుత్వం తరఫున ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగింది?
భారత్‌ను కృత్రిమ మేధ (AI) హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సదస్సును భారీ ఎత్తున ప్లాన్ చేసింది. అయితే తొలి రోజునే ప్రతినిధుల సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. రిజిస్ట్రేషన్ డెస్క్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షణ, భద్రతా తనిఖీల్లో విపరీతమైన జాప్యం, కూర్చోవడానికి తగినన్ని సీట్లు లేకపోవడం వంటి సమస్యలతో ప్రతినిధులు విసిగిపోయారు. మరీ ముఖ్యంగా సదస్సుకు వచ్చిన ప్రముఖ విదేశీ నిపుణులు కనీసం తాగునీరు కూడా దొరకక ఇబ్బంది పడ్డారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికత గురించి చర్చించే చోట, కనీస సౌకర్యాల నిర్వహణ విఫలమవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇవి కూడా చదవండి
మంత్రి అశ్విని వైష్ణవ్ వివరణ:
ఈ పరిణామాలపై మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) బాధ్యతాయుతంగా స్పందించారు. “సదస్సు విజయవంతం కావాలనే ఉద్దేశంతోనే అన్నీ ఏర్పాటు చేశాం. కానీ చివరి నిమిషంలో పెరిగిన రద్దీ వల్ల కొన్ని లోపాలు తలెత్తాయి. అతిథులకు కలిగిన అసౌకర్యానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అంతా సాఫీగా జరుగుతోంది. మాకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా ఓపెన్ మైండ్‌తో తీసుకుంటాం. ఇప్పటికే సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించేందుకు వార్ రూం కూడా ఏర్పాటు చేశాం” అని ఆయన పేర్కొన్నారు. సదస్సును విజయవంతం చేయడం కోసం తమ టీం రాత్రింబవళ్లు కష్టపడుతోందన్నారు.
సదస్సు ముఖ్యాంశాలు:
తొలిరోజు కొన్ని ఇబ్బందులు తలెత్తినా.. ఏఐ సమ్మిట్ విజయవంతంగానే జరిగింది. ప్రధాని మోడీ కూడా ఈ సదస్పుకు వచ్చి ప్రదర్శనకు ఉంచిన ఏఐ పరికరాలను పరిశీలించారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీ తయారు చేసిన ఏఐ గాగుల్స్ ఆయన దృష్టిని ఆకర్షించాయి. వాటిని పెట్టుకొని చూసిన ప్రధాని (PM Modi).. ఆ కంపెనీ కో ఫౌండర్ ప్రత్యూష్ కుమార్‌ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఏఐ సమ్మిట్ అందరి మన్ననలు పొందుతోంది.
ఇవి కూడా చదవండి













