ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం
ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్ల సచివాలయం, తొలి డయాగ్రిడ్ భవన నిర్మాణానికి భారీ కాంక్రీటు పునాది పనుల ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27న శాశ్వత సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించబోతోన్న నేపథ్యంలో ఫలితాల ఆధారిత పర్యవేక్షణ, మదింపు వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవరల సచివాలయం, తొలి డయాగ్రిడ్ భవన నిర్మాణానికి భారీ కాంక్రీటు పునాది పనుల ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సచివాలయ భవనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 41 ఎకరాల్లో నిర్మించనున్న ఈ భవనం 212 మీటర్ల ఎత్తు ఉంటుంది. 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు టవర్లు ఉంటాయి. రూ.4890 కోట్ల వ్యయం కానుంది. ఇది దేశంలోనే కొత్త రికార్డు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో రాజధానిలో స్థానిక ఆర్థిక వ్వవస్థ వృద్ధి చెందుతోందని తెలిపారు. న్యాయ భవన సముదాయాన్ని 2019 ఫిబ్రవరి నాటికి అందజేస్తామని ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.













