హోదాపై తానెప్పుడూ రాజీపడలేదు : చంద్రబాబు
ప్రత్యేక హోదాపై తానెప్పుడూ రాజీపడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. ఎంపీలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారని, రాజ్యసభలో ఎంపీలు బాగా పోరాడారని అభినందించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీకి మద్దతుగా నిలిచాయన్నారు. అన్యాయాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం ప్రజల్లో వచ్చిందని తెలిపారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఇబ్బందులు అధిగమించేందుకే ప్రాధాన్యం ఇచ్చానని పేర్కొన్నారు.
ఆర్థికంగా నిలబడేందుకు కృషి చేశానని తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చేదాక చేయూతనివ్వాలన్నామని, అయితే తన ఆరాటాన్ని వక్రీకరించేలా మాట్లాడడం సరైందికాదని అన్నారు. రాజ్యసభలో చర్చ ద్వారా దేశాన్ని మనం మెప్పించగలిగామని తెలిపారు. ఏపీకి మద్దతుగా నిలబడ్డ పార్టీలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో టీడీపీ పోరాటం ఇకపై కూడా కొనసాగిస్తామని సృష్టం చేశారు. లోక్సభలో జయదేవ్, రామ్మోహన్, కేశినేని ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని, అలాగే రాజ్యసభలో సుజనా, సీఎం రమేష్ ప్రసంగాలకు స్పందన బాగుందని అన్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని ముఖ్యమంత్రి తెలిపారు.













