సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైకాపా శ్రద్ధ
ఇసుక అక్రమ రవాణాలో వైకాపా నేతలు జుట్లు పట్టుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గం పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం పోలీసు కేసులు పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో రాజధానిలో పనులు నిలిచిపోయని అన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, యువత, మహిళలు ఎదురుచూస్తునన్నారని అన్నారు. అయితే సమస్యలు వదిలేసి సాధింపులపైనే వైకాపా శ్రద్ధ పెట్టిందని మండిపడ్డారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల్లో భరోసా నింపేలా వైకాపా ప్రభుత్వం చర్యలు లేవని విమర్శించారు. కౌలు రైతులకు రెండేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. కంపెనీలన్నీ మూతపడే దుస్థితి తెస్తున్నారని దుయ్యబట్టారు. యువత ఉపాధి పొగొట్టడమే ధ్వేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తన విద్యుత్ కంపెనీలకు నష్టం రాకూడదు.. ఇతరుల కంపెనీలు నష్టాల్లో మునిగిపోవాలనేదే జగన్ దురాలోచన అని పేర్కొన్నారు. అన్నివర్గాల సమస్యలు సభలో వినిపించాలని, పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీనేతలకు సూచించారు.













