ఏపీ ప్రయోజనాలే ముఖ్యం : చంద్రబాబు
లేని అవినీతిని టీడీపీకి అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తే.. అది వాళ్లనే చుట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని సృష్టం చేశారు. నివాసానికి వచ్చిన పార్టీ నేతలతో, విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అప్పుడూ, ఇప్పుడు తెలుగుదేశం ప్రజల పక్షమేనన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పార్టీ నేతలు పాటుపడాలన్నారు. వైసీపీ శ్రేణుల దాడుల బారినపడిన టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా, పార్టీ వారికి అన్ని వేళలా వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై, రాజధాని నగర నిర్మాణ పనులపై అక్కడేదో అవినీతి జరిగిపోయినట్లు ముఖ్యమంత్రి జగన్, మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఈ సందర్బంగా ఆక్షేపించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్రానికే పోలవరం ఇచ్చేస్తానని చెప్పి విజయవాడ వచ్చి మేమే చేస్తున్నామంటూ డప్పు కొట్టుకున్న విషయాన్ని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. పోలవరంపై నెలరోజుల్లోనే మాటలు మార్చింది జగనేనన్నారు. కాలంతో పాటు మాట మార్చేయడం వైసీపీ నేతలకు సాధ్యమన్నారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.













