టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 18 నుంచి 20 ఎంపీ స్థానాలు పార్టీ గెలుస్తున్నట్లు వెల్లడించారు. 110 అసెంబ్లీ స్థానాలతో తమ గెలుపు ఖాయమని.. ఇది 120-130 వరకూ వెళ్లొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు మైండ్ గేమ్స్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని విమర్శించారు. తొలుత వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్‌తో రేపు అన్నీ పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని, 22వ తేదీన కౌంటింగ్ ప్రక్రియపై అందరికీ మరోమారు శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. వీవీపాట్ల లెక్కింపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మోదీ అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.













