టీడీపీలో అలాంటి పరిస్థితి లేదు : చంద్రబాబు
వైసీపీలో వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, కాని తెలుగుదేశం పార్టీలో అలాంటి పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపీక జరుగుతోందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీల్లేదని ఆదేశించారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నాం అని తాను చెప్తే..అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్వవహరిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు.. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులిస్తామని సృష్టం చేశారు. కుటుంబం లాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారందరి భవిష్యత్తూ పార్టీ చూసుకుంటుందని సృష్టం చేశారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.













