ఫెడరల్ ఫ్రంట్ లేదు.. అదొక శూన్యం మాత్రమే : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు భాజపా నేతలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 29సార్లు దిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే ప్రత్యేక ప్రాధాన్యమా? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం చల్లడమే ప్రత్యేకతా ? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, గ్రామ, మండల, రాష్ట్ర పార్టీ బాధ్యులతో ‘ఎలక్షన్ మిషన్- 2019’పై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్‌కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నేతలు పాల్గొంటే.. భాజపాయేతర పక్షాల్లో తెరాస అధినేత కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్ హాజరుకావడంలేదన్నారు. వీరిద్దరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారన్నది సుస్పష్టమవుతోందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అసలు లేదు.. అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. అది భాజపాకు ప్రతిపక్షమే కాదని విమర్శించారు. రాష్ట్రంపై తెరాస నేతల ద్వేషాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. తెరాసతో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. వరంగల్‌లో రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసుల కోసం మోదీతో, అక్రమాస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.













