ఆ ముగ్గురూ నరేంద్రమోదీని విమర్శించరు
బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేన ఒకేతాను ముక్కలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్, కేసీఆర్, పవన్ అజెండా ఒక్కటేనని అన్నారు. ఆ ముగ్గురూ మోదీని విమర్శించరని, టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకూడదనేది వారి అజెండా అని అన్నారు. రాష్ట్రాన్ని వదిలేసి దేశం తిరుగుతున్నానన్నది అసత్యమని, ఏపీని అన్నిరంగాలలో నెంబర్ -1 చేశానని, ఆ తర్వాతే దేశంపై దృష్టి పెట్టానని సృష్టం చేశారు. తాను ప్రధాని అవుతానని ఎవరూ మాట్లాడద్దని సూచించారు. తన సామర్థం మన రాష్ట్రానికే ఉపయోగపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. ఆ 76 శాతం మంది ఓట్లేస్తే ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. 36 ఏళ్లుగా టీడీపీకి కాపు కాసింది బిసిలేనని అన్నారు. జయహో బిసి సదస్సుకు టీడీపీకి ప్రతిష్టాత్మకమన్నారు. ఈ ఐదేళ్లలో బీసీలకు చేసిన మేళ్లు వివరించాలని, 40 రోజులపాటు జయహో బీసీ నియోజకవర్గ సభలు పెట్టాలని నేతలకు సూచించారు.













