అన్నింటిపైనా గట్టిగా పోరాడదాం …
పోలవరం ద్వారా వైసీపీ ప్రభుత్వం దోపిడీకి శ్రీకారం చుట్టిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరానికి రూ.750 కోట్లు తగ్గించామంటూ.. రూ.7500 కోట్లు నష్టం చేకూర్చారని ఆరోపించారు. గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థే ఇప్పుడు తక్కువకు కోట్ చేసిందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్ చేసిందని పేర్కొన్నారు. మెగాకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్రబాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారన్నారు. వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదని చెప్పారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా.. వారికి అనుమతివ్వటం లేదన్నారు. ఇసుక పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ఇసుక కొరత వల్ల 20 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాలమయం చేస్తున్నారన్నారు. అన్నింటిపైనా గట్టిగా పోరాడదామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.













