వర్జీనియాకు దీటుగా విశాఖ మారుతుంది : చంద్రబాబు
అమెరికాలో వర్జీనియా నగరానికి దీటుగా విశాఖపట్నం మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమి 9వ రోజుపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాజిస్టిక్స్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దుతామని అన్నారు. నిన్న ఒక్కరోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రానికి లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో సంపద సృష్టిస్తున్నామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.













