ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం : రైతులపాలిత వరం
24లోగా చుక్కల భూములకు పరిష్కారం
సుమోటోగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
7 జిల్లాల్లో ఈ మేరకు ఏర్పాట్లు
చుక్కల భూముల సమస్యలను తనకు తానుగా (సుమోటో) పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని అనుసరించి ఈ నెల 24లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సమస్య ఎక్కువగా ఉన్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఒక సీనియర్ డిప్యూటీ కలెక్టర్‌ను జిల్లా అధికారులకు సహకరించేందుకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో పేర్కొన్న ప్రకారం..
* ఆర్ఓఆర్ చట్టం ప్రకారం 1బి రిజిస్టర్ 2వ కాలంలో నమోదైన పట్టాదారు పేరును సరి చూసుకుని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్‌లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదు చేసిన వాటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలంలో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తారు. 1954కు ముందు ఇచ్చిన డి-పట్టా, డీకేటీ పట్టా, అసైన్ భూములు అని నమోదు చేసినట్లయితే వాటిని కూడా నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తారు.
* 1954 తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములు నిషిద్ధ జాబితాలోనే కొనసాగుతాయి. చుక్కల భూముల పరిశీలన పూర్తయిన అనంతరం తుది జాబితాను తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అనంతరం 22 ఏ1 ఏ నుంచి డి వరకు కొత్త జాబితాలను నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. సెక్షన్ 22ఏ1(ఇ) జాబితాను నేరుగా ప్రభుత్వానికి పంపాలని, దానిని గెజెట్‌లో ప్రచురిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1954 రికార్డులే ప్రామాణికంగా..
1906లో దేశవ్యాప్తంగా భూముల సర్వే జరిగింది. ఆ తరువాత 1954లో రీ సర్వే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వే జరగలేదు. దీంతో భూమి హక్కులకు సంబంధించి 1954నాటి రెవెన్యూ రికార్డులే ప్రామాణికంగా ఉన్నాయి. 1954లో రీ సర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్ల వారీగా ఖాతాదారుల పేర్లు, విస్తీర్ణం నమోదు చేశారు. అయితే యాజమాన్య హక్కుకోరని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు పెట్టారు. వీటిని అప్పటి నుంచి చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. 1954 తరువాత ఆ భూములను సాగు చేసుకునే వారికి యాజమాన్య హక్కులు లేవు. వాటిని బదిలీ చేసుకునే, అమ్ముకునే అవకాశం లేదు.













