రాజధాని రైతులకు చంద్రబాబు సంఘీభావం
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు రావొచ్చంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న మహా ధర్నా వద్దకు ఆయన చేరుకున్నారు. పలువురు రైతులు తమ ఆవేదనను చంద్రబాబుకు వివరించారు. పిల్లల భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని, ప్రభుత్వం ఇప్పుడు తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం త్యాగాలు చేస్తే పెయిడ్ ఆర్టిస్టులమంటూ కొందరు విమర్శించడం ఎంతవరకు సబబని పలువురు మహిళలు నిలదీశారు. తామంతా చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చామన్నారు. రాజధాని ఎక్కడికీ తరలిపోకుండా తమ తరపున పోరాడాలని ఈ సందర్భంగా రైతులు చంద్రబాబును కోరారు.













