రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే నా పోరాటం : చంద్రబాబు
రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైకాపా నేతలు, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి ఉద్యమం జరుగుతోందని చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన అమరావతి జనభేరి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. మూడు రాజధానుల అంశంపై రెఫెరెండానికి సిద్ధమా? అని వైకాపా నేతలను ప్రశ్నించారు. మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
శంకుస్థాపన స్థలాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయింది. వైకాపా నేతలు కళ్లు తెరిచి అమరావతి ఉద్యమాన్ని చూడాలి. పోరాడుతున్న రైతులు, మహిళలను వ్యాపారులంటారా? ఉద్యమకారులను బూటు కాలితో తంతారా? జట్టు, దుస్తులు పట్టుకొని లాగుతారా? ద్రౌపతి వస్త్రాన్ని లాగినందుకు కౌరవ సామ్రాజ్యం నాశమైనంది. అమరావతిని ఎడారి, శ్మశానం, అన్నవాళ్లకు బుద్ధి ఉందా? ఒకసారి అవకాశం అడిగితే ప్రజలిచ్చారు. కానీ ఇదే వైకాపాకు చివరిసారి అవుతుంది. ఈ ప్రభుత్వానికి రాజధాని మహిళల శాపం తగలక తప్పదు. ఒక సామాజికవర్గంలో పుట్టడం నా తప్పా? ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలనుకోవడం నా తప్పా? ఈ వేదికపై ఉన్న నాయకులందరిదీ ఒకే కులమా? ప్రభుత్వాలు శాశ్వతం కాదు. జగన్‌రెడ్డి, నా దగ్గర నీ తెలివితేటలు పనిచేయవు అని మండిపడ్డారు.
జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. 20 నెలల్లో ఏమీ చేయనీ సీఎం జగన్ మరో 12 నెలల్లో ఏం చేస్తారు? ఆయన తీరుతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన నేతలు కొండను తవ్వి ఎలుకనూ పట్టుకోలేకపోయారు. జగన్ వన్‌టైమ్ సీఎం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలూ వన్టైమే. విశాఖలో వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరింగింది. పేటీఎం బ్యాచ్ మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలో ఉద్యమం చేస్తోంది. అధికారం నాకు కొత్త కాదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే పోరాడుతున్నాం. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టిన ఏకైక సీఎం జగన్. అమరావతి ఉద్యమంలో మరింత భాగస్వాములు కావాలి. జగన్ ఇప్పటికైనా కళ్లు తెరిచి క్షమాపణ చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.













