పవన్‌కు ఆంక్షలు.. యువతకు గంజాయి: చంద్రబాబు
విశాఖ పట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. నాలుగు గంటల్లో వైజాగ్ విడిచి వెళ్లాలని, అక్కడకు వచ్చినా అభిమానులకు వందనం కూడా చేయకూడదంటూ పోలీసులు తీవ్ర ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కర్నూలో ఆదోనీలో ప్రసంగించిన చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘విశాఖ పట్నానికి పవన్ వెళితే అక్కడ తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఎక్కడలేని అడ్డంకులు సృష్టించారు’ అని అన్నారు. అనంతరం ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తామన్న ప్రభుత్వం చెప్పిన విషయంపై విమర్శించారు. ‘బట్టు కూడా రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట! తదుపరి ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వైసీపీ పార్టీ నేతల ఇళ్లపై రోడ్లు వేయడం, ఫ్లైఓవర్లు కట్టడం మాకు చేతకాదా?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా మీడియా గురించి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి టీవీ ఛానెల్‌ను ఉన్మాది ఛానెల్ అని, పచ్చ మీడియా అని జగన్ అంటున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు నేను కూడా ఇలానే అని ఉంటే నేడు సాక్షి ఛానెల్, పేపర్ ఉండేవా’ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, వారికి పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని, వాల్మీకి, వడ్డెర, కమ్మరి, కురుబ, కుమ్మరి సహా అన్ని కులాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల, కూలీల పిల్లకు కూడా ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించామని, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు అడుగుతున్న యువతకు గంజాయి అందిస్తుందని ధ్వజమెత్తారు. మన రాష్ట్రంలో సమాజాన్ని సీఎం జగనే చెడగొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాను సంక్షేమాన్ని నిలిపివేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తుందని, బుద్ధి ఉన్న ఏ సీఎం అయినా అలానే చేస్తారని అన్నారు. ‘ఏ సీఎం అయినా కలెక్టరేట్లూ, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెడతానా అనుభవమంత లేదు ఈ సీఎం వయసు. నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చదివాను. మరి సీఎం జగన్ ఎక్కడ, ఏం చదువుకున్నారు’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.













