అందువల్లే ఎన్డీయే నుంచి బయటకు : చంద్రబాబు
విభజన హామీలు అమలు చేయకపోవడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేయడం వల్లే ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రూ.200 కోట్లతో నిడదవోలులో నిర్మించనున్న వంతెనకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయమని ప్రశ్నించడమే తాను చేసిన పాపం అన్నట్లుగా ప్రధాని మోదీ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన కుటుంబంపై మోదీ చేసిన వ్యక్తిగత విమర్శలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అణచివేతకు యత్నిస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయాలని పోరాటం చేస్తుంటే ఐటీ, సీబీఐ దాడులు అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో కేంద్రం కావాలనే కలుగజేసుకుంటోందని విమర్శించారు. ఈ ఏడాది మే నాటికి పోలవరం పూర్తి చేసి జూన్ కల్లా గ్రావిటీతో నీళ్లు అందిస్తామని సృష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నా, కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.













