Chandrababu: మూడుపార్టీలు కలిసుంటే.. మరో పార్టీకి ఛాన్సే ఉండదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్టీఏ (TDP) కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు ఈ వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu Naidu) మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక సంజీవనిగా పనిచేస్తుందని అన్నారు. “గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, అసాధ్యమని భావించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణను సాధించాం. విశాఖ రైల్వే జోన్‌ను పూర్తి చేసుకున్నాం. రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ, జెన్కో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అందరూ కలిసి పనిచేస్తే ఫలితాలు ఇలాగే అనూహ్యంగా ఉంటాయి,” అని ఆయన (Chandrababu Naidu) వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ కార్యకర్తలంతా ఒక్కటై పనిచేయాలని చంద్రబాబు (Chandrababu Naidu) పిలుపునిచ్చారు. “మేము రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కలిశాం. ఇందులో ఎవరి స్వప్రయోజనాలూ లేవు. మూడు పార్టీలు కలిసి సమైక్యంగా పనిచేశాయి. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి. మూడు పార్టీలు ప్రజలలో ఉంటే భవిష్యత్తులో మళ్లీ ఏ పార్టీకి అవకాశం ఉండదు. త్వరలోనే ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా అమలు చేస్తాం,” అని ఆయన (Chandrababu Naidu) తెలిపారు.













