వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆశీర్వదించండి : చంద్రబాబు
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరోసారి ఆశీర్వదించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహా సంకల్పం ముగింపు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అందించటంలో ఎక్కడా పార్టీల వారీగా వివక్ష చూపలేదని అర్హులైతే చాలు, పార్టీలకు అతీతంగా పథకాలను అందించామని సృష్టం చేశారు. స్థానికంగా మీకు ఎవరో ఒకరి వల్ల ఇబ్బంది కలిగి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇవేమీ పట్టించుకోవద్దు. నన్ను చూడండి. మీకు సంక్షేమ ఫలాలు అందించింది నేను. అందుకే రానున్న ఎన్నికల్లో మళ్లీ నన్ను గెలిపించాల్సిన చారిత్రాత్మక అవసరం మీపై ఉంది. నాలుగేళ్లు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని మంచి దారిలోకి తీసుకొచ్చా. ఇంకోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా. పార్టీలకు అతీతంగా నన్ను రానున్న ఎన్నికల్లో ఆదరిస్తే, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయటానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా. 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించండి. కేంద్రంలో ప్రధానమంతిగా ఎవరుండాలో నిర్దేశించే శక్తి నాకొస్తుంది. అప్పుడు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టడానికి వీలవుతుందని అని అన్నారు.













