జూన్ 2 చీకటిరోజు : చంద్రబాబు
2014 బాధా సంవత్సరమని, జూన్ 2 చీకటిరోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్‌లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విభజనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా అవమానించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం ఢిల్లీలో దీక్ష చేశానని గుర్తు చేశార. విభజన సమయంలో కొందమంది రాజీపడ్డారని, మరికొంతమంది కోవర్టులుగా మారారని ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా విభజన చేశారని మండిపడ్డారు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారన్నారు. ఏపీలో తొలి ఏడాది రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. సంక్షోభం, సమస్యల మధ్య ఏపీలో పాలన ప్రారంభమైందని తెలిపారు. కష్టాలు, సమస్యలు తప్ప ఏపీకి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేస్తే, బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సంతోషంగా ఉందని వేడుకలు జరుపుకోవాలని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. విభజన గాయాల నుంచి ఇంకా తేరుకోక ముందే రాష్ట్ర ప్రజలకు మళ్లీ కుట్ర రాజకీయాలు అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, ఓ వైపు జగన్, మరోవైపు పవన్, ఇంకోవైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బలపడుతుందన్న భయంతోనే నియోజకవర్గాలను పెంచలేదని ఆరోపించారు. కేంద్రం ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టుటలో 52 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు ఇబ్బంది పెట్టొద్దని, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.













