సంకల్పం చేయడమే కాదు… సాధించి తీరాలి
రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పం చేయడమ కాదు, సాధించితీరాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నవనిర్మాణ దీక్ష ముగింపుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన మహాసంకల్పం సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నవ్యాంధ్రలోని ప్రతి ఒక్కరిలో రగిలిపోతున్న కసి, ఆక్రోశాల్ని పునర్నిర్మాణం వైపు మళ్ళించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యానికనుగుణంగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రగామిగా నవ్యాంధ్రను తీర్చిదిద్దాలని అన్నారు. కనీసం ఆవిర్భావ దినోత్సవం కూడా లేని దుస్థితికి నవ్యాంధ్రను గత యూపీఏ ప్రభుత్వం దిగజార్చిందంటూ మండిపడ్డారు. కోట్లమంది విభజనను వ్యతిరేకిస్తూ రోడెక్కి ఆందోళన చేస్తున్నా యూపీఏ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి మీడియాను కట్టడి చేసి కేవలం కొన్ని నిమిషాల్లోనే విభజన బిల్లును అడ్డగోలుగా ఆమోదించారన్నారు. ఈ చర్యతో ప్రతి ఒక్క ఆంధ్రుడి హృదయం రగిలిపోయిందన్నారు. ఇప్పటికీ ఇది మండిపోతూనే ఉందన్నారు. ఈ ఆక్రోశాన్ని చల్లారనివ్వొద్దంటూ సూచించారు. 15వేల కోట్ల రెవెన్యూ లోటు, అయినప్పటికీ మొక్కవోని దీక్షనే ఆలంబనగా చేసుకుని పునర్నిర్మాణానికి నడ్డుంకట్టాం అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం నవ్యాంధ్రను అడ్డగోలుగా నిర్వీర్యం చేసే యత్నం చేశారు. మన దీక్షాదక్షతల్లో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా రూపుదిద్దడం ద్వారా వారి కుట్రను భగ్నం చేద్దామంటూ పిలుపునిచ్చారు.













