వారికి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు
తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముఖలాంటి వారు. వారికి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత తనదని అన్నారు. రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అర్హులైన అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తాం.
కాపులకు బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. రైతులకు రూ.24వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేశాం. మత్స్యకారులకు ఎస్టీల్లో రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నాం అని ముఖ్యమంత్రి అన్నారు. ఓ వైపు రాష్ట్రాభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ లబ్ది కేసుల మాఫీ కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మొన్నటి వరకు కాపులకు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన వారు, కేంద్రం పరిధిలో ఇప్పుడు ఉన్న సమయంలో సాధ్యం కాదంటున్నారని అన్నారు. కేంద్రం పరిధిలో ఉంటే వైసీపీ స్పందించదా అని ప్రశ్నించారు.













