యు టర్న్ కాదు… రైట్ టర్నే
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తనది యూ టర్న్ కాదని, రైట్ టర్న్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యామ్‌కు కృష్ణా జలాలు తరలించే ప్రధాన కాలువ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ మొన్న నన్ను ప్రధాని మోదీ విమర్శించారు. పార్లమెంటులో మన ఎంపీలను బెదిరించారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని, అందరికీ సన్మానం చేస్తానని అన్నారు. అంటే కేసులు పెడతామనా? కేసులకు మనం భయపడతామా? తెలుగోడికి అటువంటి భయమేమీ లేదు అని ప్రకటించారు. ఆయనకు మెచ్యూరిటీ ఉందా అని ప్రశ్నించారు.
మోదీ అన్నట్టు నేను వైసీపీ వలలో పడలేదు. బీజేపీయే వైసీపీ కుడితిలో పడింది అని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని తానెప్పుడూ గొంతెమ్మ కోర్కెలు కోరలేదన్నారు. 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారని నమ్మి బీజేపీతో స్నేహం చేశాం. కలిసి ఉండి సాధించలేకపోయాం. ఇప్పుడు పోరాడి సాదించుకుంటాం. అప్పటికీ చేయకపోతే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మార్చైనా సరే హక్కులు కాపాడుకుంటాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగువారి బలం తగ్గించడానికి రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ సీట్లు టీడీపీకి అందిస్తే ప్రధాని ఎవరు కావాలో నిర్ణయించే శక్తి వస్తుందని తెలిపారు. సమస్యలపై పోరాడడంలో కూడా ఎవరైనా తన తరువాతేనన్నారు. నష్టాలు, కష్టాలు నాకు కొత్త కాదు. వాటికి భయపడి పారిపోను అని సృష్టం చేశారు.













