అది సాధించేంతవరకూ పోరాటం ఆగదు : చంద్రబాబు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. అది సాధించేంతవరకూ పోరాటం ఆగదు. ఢిల్లీ పెద్దలు దిగి వచ్చేవరకు ఆందోళన చేస్తాం. మెడలు వంచి విశాఖకు రైల్వే జోన్ తెస్తాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ, నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలకు నిరసనగా విశాఖలో నిర్వహించిన ధర్మపోరాటం సభలో టీడీపీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఆయన ఆవేశపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొడుతున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైసీపీ, బీజేపీలపై మండిపడ్డారు. ఖబడ్డార్ మీ ఆటలు సాగవు. తోక జాడిస్తే ఎవరైనా సరే కత్తిరిస్తా అని హెచ్చరించారు.
విశాఖపట్నంలో ఎన్నడూ లేనంతగా ఈ సభకు స్పందన లభించిందని, జన సముద్రంలా కనిపిస్తోందని, ఎగసిపడే కెరటాలను తలపిస్తున్నారని ప్రశంసించారు. న్యాయం కోసం చేస్తున్న ధర్మపోరాటం కాబట్టే పార్టీలకు, వర్గాలకు అతీతంగా ఇంత పెద్దసంఖ్యలో వచ్చారు. అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జాతి ప్రయోజనాలు, భావితరాల కోసమే కేంద్రంపై పోరాటం అని తెలిపారు. నాలుగేళ్ల క్రితం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన మోది తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా బహిరంగ సభలో ఏం మాట్లాడారో వినాలంటూ ఆనాటి ప్రసంగాన్ని రికార్డరులో వినిపించారు. కేంద్రం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదు. తెలుగుజాతి మొత్తం ఏకం కావాలి. ఢిల్లీకి వినిపించేలా, కుట్రదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా, వారి మొద్దు నిద్ర వదిలేలా నినదిద్దాం అని పిలుపునిచ్చారు.













