సంతోష నగరాల సదస్సును విజయవంతం చేయండి
ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోషకర నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సీఎం అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల 13-15 తేదీల్లో విజయవాడలో సంతోష నగరాల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీని సంపూర్ణ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.11 లక్షల కోట్లు వెచ్చించినప్పటికీ ప్రజలకు ఇంకా చేయాల్సింది ఉంది. సంపదను సృష్టించకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. అందుకే నేను సంపదను సృష్టించి దాన్ని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వినియోగించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రపంచశ్రేణి రాజధాని అభివృద్ధి చేస్తున్నాను. అమరావతి సంపదను సృష్టిస్తుంది. అది ప్రజలకు అందుతుందన్నారు. 26కు పైగా దేశాల నుంచి నగర నేతలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సంతోష నగరాల సదస్సుకు హాజరవుతారని తెలిపారు.













