హోదా కావాలని అడిగితే ఇన్ని కుట్రలా? : చంద్రబాబు
నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రమాదమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏదైనా నేరాలు జరిగినప్పుడు పోలీసులు ధైర్యంగా వ్యవహరించాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన తిత్లీ తుపానుపై స్పందించని కేసీఆర్, కేటీఆర్, కవిత లాంటి వారు జగన్పై చిన్న దాడి జరిగి వెంటనే స్పందించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. గవర్నర్ వ్యవహార శైలి కూడా సరిగా లేదని అన్నారు. జగన్పై దాడి విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నేరుగా డీజీపీనే నివేదిక అడగడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ నేరుగా అధికారులనే సంప్రదిస్తే ఇక తామెందుకుని అన్నారు. ప్రత్యేక హోదా గురించి అడిగితే ఇన్ని దాడులు చేస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఐటీ దాడులతో వ్యాపారులు బెంబేలెత్తుతున్నారని, అభివృద్ధి అడ్డుకునే పనులు సమాజానికి మంచివి కావన్నారు.













