పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి : చంద్రబాబు
పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరులోని తుళ్లూరు మండలం శాఖమూరులో నిర్మించనున్న అంబేడ్కర్ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి నాంది పలికిన వ్యక్తి డా.బీఆర్ అంబేడ్కర్ అని అన్నారు. రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఆ స్మృతి వనంలో 18 నెలల్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తనకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కరే స్ఫూర్తి అని టీడీపీ స్థాపించినప్పుడే ఎన్టీఆర్ చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అంబేడ్కర్ మహాశయుడి ఆశయాలను తూ.చ. తప్పకుండా ఎన్టీఆర్ అమలుచేశారన్నారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలు చేసే వారి చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే సృష్టం చేశారని అన్నారు. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పేదల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు, ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు, పేదవాళ్లకు భరోసాగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. పెళ్లి కానుక ద్వారా పేద పిల్లలకు పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్నానన్నారు. పేదవాళ్లకు 75 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.













