ఎవరైనా పేర్లు మార్చుకుంటారు కానీ రద్దు చేస్తారా?
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జె-టాక్స్ కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందుపల్లెలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మనం చేసేది ధర్మపోరాటం. కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి. ఎవరైనా పథకాల పేర్లు మార్చుకుంటారు కానీ రద్దు చేస్తారా? జగనన్న వసతి దీవెన కాదు.. అది వంచన దీవెన. రాయలసీమ అభివృద్ధికి మేం చేపట్టిన ప్రాజెక్టులను ఆపేశారు. నదుల అసుసంధానం చేశాను. పుల్లివెందులకు నీళ్లిచ్చాను. వైకాపా సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కుప్పంకు కూడా నీరివ్వాలి. ఈ ప్రభుత్వం నిర్వాకంతో కుప్పం నుంచి ఎన్నో పరిశ్రమలు వెనక్కి పోయాయి అని విమర్శించారు.













