ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ హబ్ గా ఏపీ : చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో షియామి సంస్థతో పాటు ఆ సంస్థకు విడిబాగాలను సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన షియామి సంస్థ ఏపీలో తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఫాక్స్‌కాన్, డిక్సన్, సెలకాన్ వంటి సెల్‌ఫోన్ పరిశ్రమలతో ఇరవై వేల మంది ఉపాధి పొందుతున్నారని, షియామి వంటి సంస్థల ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి వస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందున్నామని, రాయలసీమకు ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతామని సృష్టం చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం భారతదేశంలో తమ సంస్థ ఉత్పత్తులను ప్రారంభించిందని షియామి సంస్థ ఇండియా ఎండీ మనో జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.













