Chandra Babu: రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకం.. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమన్న చంద్రబాబు..
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. కేవలం పది నెలల్లోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చూస్తే, కొత్త సర్కారు పెట్టుబడులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పెట్టుబడుల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల (Solar Plates) తయారీ కోసం భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సంస్థకు నెల్లూరు జిల్లా (Nellore ) రామాయపట్నం పోర్టు (Ramayapatnam port) వద్ద 8,365 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే, ఈ సంస్థ గతంలో వైసీపీ(YCP) కీలక నేతలతో సంబంధం ఉన్నదనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కేబినెట్ సమావేశంలో కొంతమంది మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ కంపెనీకి ఇంత విస్తృత స్థలాన్ని కేటాయించడం సరైనదా అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందిస్తూ పెట్టుబడుల విషయంలో రాజకీయ కోణాన్ని పెంచడం అవసరం లేదని స్పష్టం చేశారు. ఏ కంపెనీ అయినా పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడితే, వాటి ప్రతిపాదనలను పరిశీలించి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. కంపెనీలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయనే విషయం కంటే, అవి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా లేదా అనే విషయమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది ఓ అద్భుతమైన అవకాశంగా చూడాలి. కొత్త పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఏ కంపెనీ వెనుక రాజకీయ సంబంధాలున్నాయనే అంశాన్ని పరిశీలించడం కంటే, పెట్టుబడులు రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాయనే విషయాన్ని ముందుగా చూడాలి. ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు ఒప్పందాలను సమీక్షించుకునే హక్కు ఉంటుంది. కంపెనీలు నిబంధనలు పాటించకపోతే, అవసరమైన మార్గదర్శకాలను పాటించని స్థితిలో ఉంటే, వాటిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ, పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను రాజకీయ కోణంలో చూసి అవి రాష్ట్రానికి లాభదాయకమా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టడం సరైంది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
పెట్టుబడులు ఏ ప్రభుత్వం అయినా స్వాగతించాల్సిన అంశమే. ఏపీలో పరిశ్రమలు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాకుండా, అభివృద్ధికి దారితీసే కీలక అడుగులు పడతాయి. అందుకే, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను ఎలాంటి రాజకీయాలకు లోను కాకుండా తీసుకోవాలనే చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, నిబంధనలను పాటించేలా కంపెనీలను నిర్దేశించడం ముఖ్యమని స్పష్టంచేశారు. ఈ విషయం మీద ఆయన చెప్పిన మాటలకు మంత్రులు మౌనం పాటించడం గమనార్హం. ప్రభుత్వ విధానాన్ని అనుసరించనివారికి మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచించారని సమాచారం.













