టీడీపీ కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తా : చంద్రబాబు
పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడటం మానుకోవాలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కోడుమూరులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సీఎం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అనుమతిలిచ్చానా వాటిని గాలికి వదిలేశారని అన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం 3 రాజధానులు ఎలా కడతారని ఎద్దేవా చేశారు.
డోన్‌లో పనికిమాలిన మంత్రి నా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చారు. పోలీసులారా మీ జీవితాలను ఇబ్బందుల్లోకి తెచ్చుకోవద్దు అని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి మార్చే పరిస్థితి వచ్చిందన్నారు.













