Chandrababu: క్లూస్ సేకరణలో సాంకేతిక వాడాలి.. వివేకా హత్య కేసు పెద్ద కేస్ స్టడీ: సీఎం చంద్రబాబు
నేరాల నియంత్రణ, శాంతి భద్రతలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (CM Chandrababu) పోలీసు శాఖ సమగ్ర ప్రజెంటేషన్‌ను ఇచ్చింది. టెక్నాలజీ వినియోగంతో కేసుల పరిష్కారం, నేరస్థుల శిక్షించే విధానాల్లో ఎలాంటి చర్యలు చేపడుతోంది చెప్పారు . డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అమలు చేస్తున్న చర్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులను మెచ్చుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu).. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి నేరస్థులను గుర్తించడంలో చొరవ చూపాలని సూచించారు. నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించే విధానాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. నేరస్థులు దొరకకుండా ఉండేందుకు ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో విచారణ అధికారులు తెలివిగా వ్యవహరించాలని సీఎం చెప్పారు.
నేరస్థులలో కొందరు తప్పించుకోగా, మరికొందరు ఇతరులపై నేరాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం (CM Chandrababu) వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) ఈ విషయంలో పెద్ద కేస్ స్టడీగా మారిందని, ఆ కేసు విచారణలో ఎదురైన సవాళ్లను గుర్తుంచుకోవాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో ప్రామాణిక విధానాలను (SOP) ఖచ్చితంగా పాటించాలని పోలీసులకు సీఎం సూచించారు. నేరస్థులను వెంటనే గుర్తించి శిక్షపడేలా చర్యలు తీసుకోవడంలో క్లూస్ టీమ్ కీలక పాత్ర పోషించాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, నేరాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం (CM Chandrababu) ఆదేశించారు.













